దేన్నైనా ఆడుతూ పాడుతూ చేయడం రుచికి అలవాటు. ఖాళీ దొరికితే బొమ్మలు చేయడం, పెయింటింగ్ వేయడం తన వ్యాపకాలు. ఉద్యోగంలోకి అడుగుపెట్టాక వాటికి సమయమే దొరికేది కాదు. జీవితం నిస్సారంగా అనిపించడంతో దాన్నుంచి బయటపడాలనుకుంది. తను నిఫ్ట్ ముంబయి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. టాటా వెస్ట్‌సైడ్, స్పెన్సర్స్ సంస్థల్లో ఏడేళ్లు పనిచేసింది. సొంతంగా ఏదైనా చేయాలని 2020లో ‘ఆరువి రుచి వర్మ’ బ్రాండ్‌ని మొదలుపెట్టింది. రూ.2.5 లక్షలతో ప్రారంభమైన తన వ్యాపారం ఏడాదిలోనే రూ.1.8 కోట్లకు చేరుకుంది.
‘చదువవ్వగానే ఉద్యోగం. పెద్ద సంస్థలు, తోటి అమ్మాయిలు అసూయపడే జీతం. కానీ ఈ 9-5 గంటల జీవితంలో నా వ్యాపకాలు, సృజనాత్మకత పక్కకు వెళ్లిపోయాయి. ఏదైనా ప్రయత్నిద్దామనుకున్నా సమయమేది? సొంత వ్యాపారానికేమో అనుభవం లేదు. బిహార్‌లోని ఓ చిన్న పట్టణం నుంచొచ్చా. త్వరపడి ధైర్యం చేయలేను. అయినా ఆలోచన మానలేదు. ఓసారి ఆన్‌లైన్‌లో ఏదో కొంటోంటే భిన్న డిజైనర్ల వస్త్రాలు ఒకేచోట దొరుకుతున్నాయి కదా.. నేనూ ప్రయత్నిస్తే అన్న ఆలోచన తట్టింది. వెంటనే చాలా అధ్యయనం చేశా. అయినా తెలియని భయం. అసలు వ్యాపారం మొదలుపెట్టడమెలా అని గూగుల్‌లో వెతికా. కంపెనీ రిజిస్టర్ చేయడం దగ్గర్నుంచి టాక్స్, మార్కెటింగ్.. ఇలా ఒక్కోదాని గురించీ నేర్చుకున్నా. అంతే ఉద్యోగానికి రాజీనామా చేశా. నా నిర్ణయం విన్నప్పుడు ఇంట్లోవాళ్లు నిరాశపడ్డారు. మంచి ఉద్యోగాన్ని వదులుకోవద్దన్నారు. నష్టాలు తట్టుకోలేనన్నారు. నేను వినలేదు. నా సంస్థలో నేనొక్కదాన్నే. ఇంట్లో కంప్యూటర్‌పై డిజైన్ చేసి, బయట కుట్టిచ్చేదాన్ని. గర్భిణులకు పెద్దగా డిజైన్లు దొరకవు కాబట్టి, వాళ్లపై దృష్టిపెట్టా. ఒకటి బాగుందనుకున్నాక పెద్ద సంఖ్యలో కుట్టించా. వాటిని అమెజాన్, మింత్రా, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ వేదికల్లో ఉంచా. 24 గంటల్లోనే మొదటి ఆర్డర్ వచ్చింది. ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ప్రతివారం కొత్త డిజైన్లు తెస్తుంటా. స్వల్పవ్యవధిలోనే వ్యాపారం రూ.కోటిని దాటింది. ఈ ఏడాది ఇప్పటికే రూ.3 కోట్ల వ్యాపారం జరిగింది. ఏడాది చివరికి రూ.5కోట్లకు చేరుకుంటా. ఇదంతా ఇంటి నుంచే’ అని సంబరంగా చెబుతోంది రుచి. ఈ మధ్యే క్యాజువల్ వేర్‌పైనా దృష్టిపెట్టింది. చేయలేవేమో అన్నవారే ఇప్పుడామెను ఇంటి నుంచి భలే సంపాదిస్తున్నావంటూ అభినందిస్తున్నారు. ‘కలను సాకారం చేసుకోవడానికి వెనకాడొద్దు. ప్రయత్నించాలే కానీ అవకాశాలు బోలెడు’ అనే చెప్పే ఈ 34 ఏళ్ల అమ్మాయి.. వ్యాపారం మనవల్ల కాదు అనుకునే ఎంతోమందికి తన కథ స్ఫూర్తిగా నిలిస్తే చాలంటోంది.